ఈ రోజుల్లో సెలెబ్రెటీస్ లైఫ్ అంటే అందరికీ ఆసక్తే. వాళ్ల జీవితంలో జరిగిన ప్రతీ చిన్న సంఘటన గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. దాన్నే దర్శక నిర్మాతలు క్యాష్ చేసుకుంటారు. ఇక చనిపోయిన వ్యక్తుల గురించి తెలుసుకోవడం అంటే మహా ఇష్టం. అందులోనూ శ్రీదేవి లాంటి లెజెండ్ గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి..? అందుకే ఇప్పుడు శ్రీదేవి బయోపిక్ పై ఇండస్ట్రీలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఆమె చనిపోయి పది రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే ఆమె జీవితంపై సినిమాలు చేయడానికి కొందరు నిర్మాతలు, దర్శకులు సిద్ధమైపోతున్నారు. ఒకటి కాదు.. శ్రీదేవి జీవితంపై రెండు బయోపిక్ లు రానున్నాయని తెలుస్తుంది.
ఒకటి ఇందులో వర్మ చేస్తాడేమో అనే అనుమానాలు ఉన్నాయి. కానీ తను చేయనని ఇప్పటికే చెప్పేసాడు వర్మ. ఒకవేళ శ్రీదేవి బయోపిక్ గానీ వర్మ అనౌన్స్ చేస్తే మాత్రం అది పెద్ద సంచలనమే అయిపోతుంది. ఎందు కంటే బోనీకపూర్ కంటే శ్రీదేవిని బాగా అర్థం చేసుకున్నది వర్మే. ఆమె చనిపోయిన తర్వాత వర్మ రాసిన లేఖ చదివి కన్నీళ్లు పెట్టుకున్నారంతా. ఓ హీరోయిన్ ను అభిమాని ఇంతగా అర్థం చేసుకున్నాడా అంటూ వర్మను అంతా పొగిడేసారు. అలాంటి వర్మ ఇప్పుడు తన అభిమాన తార జీవితంపై ఓ సినిమా చేయకుండా ఉంటాడా..? అందులోనూ ఆమె జీవితంలోని ప్రతీ వివాదాన్ని చాలా దగ్గర్నుంచీ చూసిన వ్యక్తుల్లో వర్మ కూడా ఒకరు. ఇక నిజాలన్నీ బయటికి తీస్తే శ్రీదేవి జీవితం మనసుకు తాకడం ఖాయం. కానీ ఆయన చేయనంటున్నాడు. ఎలాగూ శ్రీదేవి అంటే ప్యాన్ ఇండియన్ హీరోయిన్ కాబట్టి బయోపిక్ ఎన్ని భాషల్లో చేసినా సమస్య ఉండదు. మరి చూడాలిక.. శ్రీదేవి జీవితానికి ముందు ఎవరు తెరరూపం ఇస్తారో..?