తెలుగు సినిమాకు ఆల్రెడీ ఓ జబ్బు ఉంది. అదే పైరసీ. సినిమా విడుదలైన రెండో రోజే నెట్ లో పైరసీ ప్రత్యక్షమవుతుంది. దాన్ని ఆపడానికి దర్శక నిర్మాతలు నానా తంటాలు పడుతున్నా.. పైరసీ భూతం మాత్రం అలాగే ఉంది. దీనితోనే తల బొప్పి కడుతుంటే ఇప్పుడు మరోటి తయారయింది ఇండస్ట్రీకి. అదే లీకేజ్ యవ్వారం. సినిమా ఫుటేజ్, విజువల్స్ విడుదలకు ముందే.. ఎడిటింగ్ రూమ్స్ లోంచి మాయమవుతున్నాయి. అవి నెట్ లో ప్రత్యక్షమవుతున్నాయి.
ఐదేళ్ల కింద అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే నెట్ లో ప్రత్యక్షమవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత గతేడాది బాహుబలిఓ పాటు బాహుబలి 2 విజువల్స్ కూడా ఇలాగే నెట్ లో లీకయ్యాయి. ఈ మూడు సందర్భాల్లో వీడియో దొంగతనం చేసింది ఆయా సినిమాలకు పనిచేస్తున్న టీం కావడమే ఇక్కడ గమనార్హం. ఇక ఇప్పుడు గీతాగోవిందం కూడా లీక్ అయింది. అది కూడా ఏకంగా సినిమా అంతా. డైరెక్టర్స్ కాపీ అనే ముద్రతో ఈ చిత్రం లీక్ అయింది. పకడ్భందీగా చేస్తోన్నా కూడా.. ఎడిటింగ్ రూమ్ నుంచే ఈ విజువల్స్ లీకవ్వడం సంచలనం సృష్టిస్తోంది. గుంటూర్ లోని ఇద్దరు విధ్యార్థుల దగ్గర ఈ చిత్రం పైరసీ దొరికింది.
సినిమా విడుదలకు ముందే లీక్ ఎందుకు చేసారో ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. ఇండస్ట్రీ అంతా వేచి చూస్తోన్న సినిమాకు సంబంధించిన పైరసీని ఇలా విడుదల చేస్తుంటే నిర్మాతలు ఏమైపోవాలి..? లీక్ చేస్తే తనకు ఊచలు తప్పవని తెలిసినా.. కావాలని ఎందుకు ఇలా చేస్తున్నారు..? చిన్న సరదా కోసం ఇలా లీక్ చేయడం వల్ల కోట్లలో నష్టం వస్తుంది. మొత్తానికి ఇలా ఇంటిదొంగలే ఇలాంటి పని చేస్తుంటే ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మరాదో కూడా తెలియడం లేదు. మొత్తానికి ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎంటర్ అయింది.. కానీ గీతగోవిందం పైరసీ ఎంతవరకు విస్తరించకుండా ఆపుతారో చూడాలిక..!