హరీష్ శంకర్ కు మెగా హీరోల సెంటిమెంట్ కలిసొస్తుందా..

ఏడాదిన్నర నుంచి ఖాళీగా ఉన్న దర్శకుడు మరోసారి మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఆయనే హరీష్ శంకర్. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా వాల్మీకి సినిమా మొదలు పెట్టాడు ఈ దర్శకుడు. ఈ సినిమాపై అందరూ నమ్మకంగా కనిపిస్తున్నారు. దానికి కారణం ఆయనకు మెగా హీరోలతో ఉన్న ట్రాక్ రికార్డు. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. అందుకే ఇదే నమ్మకంతో ఇప్పుడు కచ్చితంగా విజయం సాధిస్తుందని చెబుతున్నాడు హరీష్ శంకర్. తమిళనాట విజయం సాధించిన జిగర్తాండ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు హరీష్ శంకర్.

మనోడికి రీమేక్ సినిమాలు బాగానే కలిసొచ్చాయి. గబ్బర్ సింగ్ సినిమా తెలుగులో ఒరిజినల్ చేసిన హిందీ వాళ్లు కూడా అసూయపడేలా తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు జిగర్తండ సినిమాను కూడా ఇలాగే తెరకెక్కిస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. వరుణ్ తేజ్ ఇందులో నెగిటివ్ పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇదే ఏడాది సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు హరీష్ శంకర్. మొత్తానికి గబ్బర్ సింగ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, డీజే సినిమాల తర్వాత మెగా హీరోతో మరో విజయం హరీష్ శంకర్ అందుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here