అవును.. సముద్రంలో చేపలకు కొదవా.. ఇండస్ట్రీలో వారసులకు కొదవా..? ఒక్కరు వస్తే చాలు ఆటోమేటిక్ గా అందరూ వచ్చేస్తారు. ఇప్పటికే మన ఇండస్ట్రీ 80 శాతం వారసులతో నిండిపోయింది. ఇప్పుడు ఈ కోవలో మరో హీరో కూడా వస్తున్నాడు. అతడే వైష్ణవ్ తేజ్. సాయిధరమ్ తేజ్ తమ్ముడు. మెగా చిన్న మేనల్లుడు. ఇప్పుడు ఈ వారసున్ని పరిచయం చేయడానికి ఓ భారీ నిర్మాణ సంస్ధ కూడా రెడీ అయింది.
అదే మైత్రి మూవీ మేకర్స్. వాళ్లతో పాటు సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటుంది. ఈ సంస్థ ఇప్పుడు మెగా మేనల్లుడిని పరిచయం చేసే కార్యక్రమం పెట్టుకుంది. కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించబోయే ఈ చిత్రానికి సుకుమార్ కథ అందించడం విశేషం. ఇప్పటికే మెగా మేనల్లుడు సాయిధరంతేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ముందుకెళ్తున్నాడు.
ఈ మధ్య కొన్ని ఫ్లాపులు వచ్చినా కూడా సాయికి ఇమేజ్ అయితే ఉంది. ఇప్పుడు ఇదే దారిలో అతడి తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా వస్తున్నాడు. ఈయన్ని హీరోను పరిచయం చేసే బాధ్యతను సుకుమార్ తీసుకోవడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈయన నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో కొత్త చిత్ర ఓపెనింగ్ కూడా జరిగింది. పైగా వైష్ణవ్ వెనక పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది. ముందు నుంచి సాయికి కూడా ఈయనే బ్యాక్ సపోర్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు అతడి తమ్ముడికి కూడా పవర్ స్టార్ వెనకుంటున్నాడు. మరి చూడాలిక.. ఓ అల్లుడు గిల్లుడు బాగానే ఉంది.. మరి ఇప్పుడు ఈ కొత్తల్లుడు ఏం చేస్తాడో..?