ఓకే పండక్కి నాలుగు సినిమాలు వస్తున్నప్పుడే థియేటర్స్ సమస్య వస్తుందని ముందునుంచి అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఏకంగా రజనీకాంత్ సినిమా కి థియేటర్ లు లేక గోల పెడుతున్నారు నిర్మాతలు. ఇప్పుడు ఈ వివాదం ముదిరి పాకాన పడింది. ఇన్ని రోజులు థియేటర్ల మాఫియా టాలీవుడ్లో నడుస్తుందనే వార్తలు వినిపించినా కూడా ఎవరూ ధైర్యంగా మాట్లాడటానికి ముందుకు రాలేదు. దాసరి నారాయణరావు ఉన్నప్పుడు చిన్న సినిమాలను బతికించండి అంటూ వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఎవరు అంత ధైర్యంగా ముందుకు వచ్చి థియేటర్ల మాఫియా గురించి మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు పేట సినిమా ప్రీ రిలీజ్ వేడుక దీనికి వేదికయ్యింది. స్టేజీపై అందరూ చూస్తుండగానే నిర్మాత అశోక్ వల్లభనేని తన కష్టాల గురించి చెప్పుకున్నాడు.
తెలుగు ఇండస్ట్రీలో థియేటర్లు వాళ్ల అబ్బ సొత్తు అన్నట్లు కొందరు వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారని.. వేరే సినిమాలకు థియేటర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్నాడు. ఇప్పుడు రజినీకాంత్ సినిమా థియేటర్లు ఇవ్వలేదని.. వాళ్ళ సినిమాలు మాత్రమే సంక్రాంతికి ఆడాలని ప్లాన్ చేసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అశోక్ వల్లభనేని.
ఈయనకు అక్కడికి వచ్చిన కొందరు ఇండస్ట్రీ వర్గాలు కూడా సపోర్ట్ చేయడం గమనార్హం. కేవలం వాళ్ళ సినిమాలు మాత్రమే ఆడేలా థియేటర్స్ అన్నీ వాళ్లే బ్లాక్ చేసుకుంటున్నారని.. సినిమా బాగున్నా లేకపోయినా వాళ్లు మాత్రమే బాగుండాలని స్వార్థంతో ఆలోచిస్తున్నారు అంటున్నాడు అశోక్. ఈ పద్ధతి రానురాను మరింత దారుణంగా తయారవుతుంది అంటున్నారు ఆయన. దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ ఇలా ఒక్కొక్కరి పేర్లు పెట్టు మరి విమర్శించారు అశోక్. మరి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో చూడాలి.