సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి.. జనవరి 9 నుంచి 12 వరకు వరుసగా నాలుగు రోజులు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలన్నింటిపై భారీ అంచనాలున్నాయి. మరి వీటిలో ఏ సినిమా వాటా ఎంత ఏ సినిమాకు ఎంత సత్తా ఉంది.. బాక్సాఫీస్ దగ్గర రికార్డులను తిరగరాసే సినిమా ఏది.. ఇప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకులను ఇవే అనుమానాలు వెంటాడుతున్నాయి. ఒకటి రెండు సినిమాలు అంటే ఏమో అనుకోవచ్చు కానీ నాలుగు సినిమాలు వస్తుంటే సరికి డిస్ట్రిబ్యూటర్లు కూడా భయపడుతున్నారు.
ఈ సంక్రాంతి ఎలా ఉండబోతుందో టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా ఈ పండక్కి బిజినెస్ లో అగ్రభాగం తీసుకుంటున్న సినిమా రామ్ చరణ్ వినయ విధేయ రామ. చిత్రం దాదాపు 90 కోట్ల బిజినెస్ చేసింది. అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాల్సిందే. దాంతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు కూడా 72 కోట్ల బిజినెస్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ చిత్రానికి కూడా అన్ని కోట్లు రావాలి అంటే ఖచ్చితంగా తొలిరోజు అద్భుతమైన టాక్ తెచ్చుకోవాలి.. లేదంటే కథానాయకుడు బయటపడటం కష్టం. బాలయ్య గత రికార్డు 49 కోట్లు మాత్రమే.. ఇప్పుడు దాని కంటే 33 కోట్లు ఎక్కువగా వసూలు చేయాలి కథానాయకుడు. దాంతో పాటు వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్ 2 సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమా బిజినెస్ కూడా దాదాపు 35 కోట్ల వరకు జరుగుతుందని తెలుస్తోంది. ఇద్దరు హీరోలకు ఇది చాలా పెద్ద లక్ష్యం. ఈ సినిమాతో పాటు పేట కూడా సంక్రాంతికి వస్తుంది. దీన్ని కూడా ఇరవైఒక్క కోట్లకు అమ్మేసారు. దాంతో ఈ పండక్కి రానున్న నాలుగు సినిమాలు వేటికవే అన్నట్లు ఉన్నాయి. బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకుంటే తప్ప బాక్సాఫీస్ బరిలో బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నాయి సంక్రాంతి సినిమాలు. అంత సత్తా వీటికి ఉందా లేదా అనేది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.