సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కుమ్మేస్తాడు.. నరికేస్తాడు అంటూ చాలా మంది చాలా ఊహించారు. కానీ అదేం విచిత్రమో మరి ఇంత వరకు సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక్కసారి కూడా కడుపుబ్బ నవ్వించలేదు ఈ భీమవరం బుల్లోడు. ఒకప్పుడు సునీల్ తెరపై కనిపిస్తే నవ్వులు పూసేవి. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈయనకు తగ్గ క్యారెక్టర్లు ఇంతవరకు పడలేదు. అరవింద సమేతలో మంచి పాత్ర చేశాడు కానీ అది కామెడీ రోల్ కాదు.. సీరియస్ గా ఉండే సపోర్టింగ్ రోల్. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పడి పడి లేచే మనసులో కూడా సునీల్ పెద్దగా నవ్వించలేదు.
దాంతో ఇప్పుడు సునీల్ ఆశలన్నీ కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రలహరి సినిమాపైనే ఉన్నాయి. సాయిధరమ్ తేజ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈసినిమాతో పాటు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో నటించబోతున్నాడు సునీల్. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు ఈ కమెడియన్. తిరుమల దర్శనానికి వచ్చిన సునీల్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై మాట్లాడాడు. కచ్చితంగా త్రివిక్రమ్ సినిమాతో మళ్లీ తానేంటో చూపిస్తానని అంటూ సవాల్ చేస్తున్నాడు సునీల్. మరి ఈయన నమ్మకాన్ని మాటల మాంత్రికుడు ఎంతవరకు నిలబెడతాడనేది చూడాలి.