ఓ సినిమా హిట్ అయిన వెంటనే మరో సినిమా కోసం కమర్షియల్ దారులు వెతుక్కునే దర్శకులు ఉన్న ఇండస్ట్రీ ఇది. హాయిగా సేఫ్ గేమ్ ఆడుకుందాం ఎందుకు ప్రయోగాలు మనకు అనుకుంటుంటారు. కానీ అందరు దర్శకులు అలాగే ఉంటే ఇండస్ట్రీ ముందుకెళ్లదు కదా.
అందుకే అప్పుడప్పుడూ సంకల్ప్ రెడ్డి లాంటి వాళ్లు కూడా వస్తుంటారు. గతేడాది ఘాజీతో ఈయన సృష్టించిన సంచలనం చిన్నదేం కాదు. ఈయన కృషిని గుర్తించి నేషనల్ అవార్డ్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ తో ఈయన అంతరిక్షం నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ప్రీ లుక్ విడుదలైంది. ఇది చూస్తుంటే ఏ రేంజ్ లో సినిమా ఉండబోతుందో కళ్ల ముందు కనిపిస్తుంది. ఇక వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు ఫిదా.. తొలిప్రేమ వరస విజయాలు సాధించినందుకు కాదు.. మరో కారణంతో గాల్లో తేలిపోనున్నాడు. ఈ రెండు సినిమాలతో మనోడి మార్కెట్ పెరిగింది. దాంతో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు నిర్మాతలు.
ఇందుకే ఆనందంగా ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ కుర్ర హీరో ఇప్పుడు 25 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అది కూడా ఘాజీ లాంటి సంచలన సినిమా అందించిన సంకల్ప్ రెడ్డితో. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది ఈ చిత్రం. స్పేస్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి ఆ మధ్య కజకిస్థాన్ వెళ్లి జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నాడు వరుణ్ తేజ్. రాజవ్ రెడ్డి.. సాయిబాబా.. క్రిష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ కు జోడీగా లావణ్య త్రిపాఠి.. అదితిరావ్ హైద్రీ నటిస్తున్నారు. ఇలాంటి కథతో ఇప్పటికే తమిళనాట టిక్ టిక్ టిక్ అనే సినిమా వచ్చింది. అయితే అది ఆడలేదు. దాంతో ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్ట్ 15న వరుణ్ తేజ్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా విడుదల కానుంది. ఘాజీతోనే ఇండియా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్రాడు ఇప్పుడు వరుణ్ తేజ్ తో కలిసి ఏం చేస్తాడో చూడాలిక..!