ఒక్కోసారి అంతే.. మంచి సినిమాలు కూడా ఎందుకో తెలియదు కానీ కలెక్షన్ల వేటలో వెనకబడుతుంటాయి. ఇప్పుడు కథానాయకుడు సినిమాను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఊహించిన వసూళ్లు రావడం లేదు. సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా ఎందుకో తెలియదు మరి వసూళ్లలో మాత్రం ఆ టాక్ కనిపించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 14కోట్లు మాత్రమే వసూలు చేసింది కథానాయకుడు.
ఈ చిత్రాన్ని పైకి లేపడానికి.. పడిపోతున్న కలెక్షన్లపై ప్రభావం చూపించడానికి ప్రమోషన్ దంచేస్తున్నాడు బాలయ్య. విద్యాబాలన్ కూడా ఈ చిత్రం కోసం హైదరాబాద్ తో పాటు బాలయ్య వెంట బెంగళూర్, తిరుపతి లాంటి ప్రదేశాలకు కూడా వెళ్లింది. అక్కడ తమ సినిమాను చూడండంటూ ప్రమోట్ చేసింది. అయినా కూడా కలెక్షన్లలో ఎలాంటి తేడా కనిపించడం లేదు.
ఇప్పటికీ ఈ చిత్రం చాలా బాకీ పడింది. కథానాయకుడు సేఫ్ కావాలంటే అక్షరాలా 72 కోట్లు వసూలు చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అంత రావడం కష్టమే. ఇప్పటికిప్పుడు అంత అద్భుతం జరగడం కూడా కష్టమే. దాంతో ఏ దేవుడు వచ్చి కథానాయకుడును గట్టున పడేస్తాడో తెలియక తిక్కచూపులు చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కథానాయకుడు పరిస్థితే ఇలా ఉంటే రేపు రాబోయే మహానాయకుడు ఎలా ఉండబోతుందో అనేది తలుచుకుంటేనే భయపడుతున్నారు బయ్యర్లు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. జనవరి 12 నుంచి మహానాయకుడు షూటింగ్ లో అడుగు పెట్టాడు బాలకృష్ణ.