అక్కినేని అల్లుడు కొట్టేలా ఉన్నాడు..!


ప‌దేళ్లైంది ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సినిమాలు చేసాడు.. కానీ క‌నీసం హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయాడు. అస‌లే హిట్స్ లేవంటే.. ఏ రెండేళ్ల‌కో మూడేళ్ల‌కో ఒక్క‌సారి వ‌స్తాడు. అత‌డే సుశాంత్.. కేరాఫ్ అక్కినేని ఫ్యామిలీ. నాగార్జున అక్క కొడుకు ఈ కుర్రాడు. ప‌దేళ్ల కింద కాళిదాసు సినిమాతో వ‌చ్చాడు. ఆ త‌ర్వాత క‌రెంట్ అన్నాడు.. అది పాస్ అవ్వ‌లేదు. అడ్డా అన్నాడు.. అదెక్క‌డో అడ్ర‌స్ తేల‌లేదు. ఇక రెండేళ్ల కింద ఆటాడుకుందాం రా అంటూ పిలిచాడు. దాని జాడే క‌నిపించ‌లేదు. ఇప్పుడు చిలసౌ అంటున్నాడు.
ఈ సారి కాస్త కొత్త‌గా ట్రై చేసిన‌ట్లు క‌నిపిస్తున్నాడు ఈ కుర్రాడు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మార‌డం విశేషం. ఇన్నాళ్ళూ న‌టుడిగా అల‌రించిన రాహుల్.. ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా త‌న ల‌క్ టెస్ట్ చేసుకుంటున్నాడు. తాజాగా విడుద‌లైన చిలసౌ రెండో టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. తొలి టీజ‌ర్ లో పెళ్లికొడుకు గురించి చూపించిన ద‌ర్శ‌కుడు.. రెండో టీజ‌ర్ లో పెళ్లి కూతురును ప‌రిచ‌యం చేసాడు.
పెళ్లి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం తొలి టీజ‌ర్ తోనే ఆస‌క్తి పుట్టించింది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు సుశాంత్ సినిమాపై కానీ.. రాహుల్ ద‌ర్శ‌క‌త్వంపై కానీ పెద్ద‌గా న‌మ్మ‌కాలు అయితే లేవు. కానీ ఇప్పుడు టీజ‌ర్స్ చూసాక మాత్రం క‌చ్చితంగా లైట్ తీసుకోవ‌డానికి లేదు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఏదో మ్యాజిక్ చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లే అనిపిస్తుంది. జులై 27న చిల‌సౌ విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిరంజీవి ల‌క్ష్మీ సౌభాగ్య‌వ‌తి అయినా సుశాంత్ కు కోరుకున్న విజ‌యం తీసుకొస్తుందో రాదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here