అభిమానుల సమక్షంలో ఘనంగా విజయనిర్మల 73వ జన్మదిన వేడుకలు !!

సీనియర్ నటీమణి, దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ విజయనిర్మల గారు నేడు తన 73వ జన్మదిన వేడుకలను ఘట్టమనేని వంశాభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నారు.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. “అక్కినేని నాగేశ్వర్రావు, రజనీకాంత్, శివాజీగణేషన్ వంటి స్టార్ హీరోలతో సినిమా తీసిన ఏకైక లేడీ డైరెక్టర్ విజయనిర్మల. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన 44 చిత్రాల్లో సగానికి పైగా సినిమాల్లో నేను నటించినందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఏడాది ఈ విధంగా మా ఇంటికి విచ్చేసి తమ అభిమానాన్ని చాటుకొంటున్న అభిమానులందరికీ ప్రత్యేకంగా కృతజ్నతలు తెలుపుకొంటున్నాను. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు గౌరవించిన విజయనిర్మలను త్వరలోనే భారత ప్రభుత్వం తగిన రీతిలో సత్కరిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.
విజయ నిర్మల మాట్లాడుతూ.. “ఒకసారి దాసరిగారు మా ఇంటికొచ్చి నా పుట్టినరోజు వేడుకలకు అభిమానులు రావడం చూసి సంతోషించి.. “ఏ స్టార్ హీరోయిన్ కీ ఈ రేంజ్ క్రేజ్ లేదు” అన్నారు. అదే నాకు పద్మభూషన్ తో సమానం. నా పుట్టినరోజు వేడుకలకు హాజరైన అభిమానులందరికీ కృతజ్నతలు” అన్నారు.
నిర్మాత-సీనియర్ పాత్రికేయులు బి.ఏ.రాజు మాట్లాడుతూ.. “దాసరి, బాపు వంటి టాప్ డైరెక్టర్స్ ఫస్ట్ హీరోయిన్ విజయనిర్మలగారు. అలాగే విజయశాంతి లాంటి స్టార్ హీరోయిన్ ను “కిలాడి కృష్ణుడు”తో తెలుగు తెరకు పరిచయం చేసింది కూడా విజయనిర్మలగారే. అంతటి ఘనత కలిగిన విజయనిర్మల పుట్టినరోజు వేడుకల్లో భాగస్వాములవ్వడం సంతోషంగా ఉంది” అన్నారు.
సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. “మా కుటుంబ సభ్యులందరి పుట్టినరోజులకు ఈ విధంగా అభిమానులు విచ్చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎలాంటి స్వార్ధం లేకుండా కేవలం అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు” అన్నారు.
ఇంకా ఈ పుట్టినరోజు వేడుకల్లో సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘాల పెద్దలు, మరియు సీనియర్ ఫ్యాన్స్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
అలాగే తన పుట్టినరోజు సందర్భంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు విజయనిర్మల 73 వేల రూపాయల చెక్ ను అందించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here