అలా ఎలా సాధ్యం మోహ‌న్ లాల్ గారూ..? 


ఒక్క హిట్ కొట్ట‌డానికే నానా తంటాలు ప‌డుతుంటారు మ‌న స్టార్ హీరోలు. అదేమంటే క‌థ‌లు దొరక‌ట్లేదంటూ సాకులు చెబ‌తారు. కానీ మ‌ళ‌యాల సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ మాత్రం ఏడాదికి ఏకంగా నాలుగు సినిమాలు చేస్తూ.. అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ లే కొడుతూ వెళ్తున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న ట్రాక్ రికార్డ్ చూసి స్టార్ హీరోలంతా కుళ్ల‌కుంటున్నారు. అస‌లు ఇలాంటి రికార్డులు సాధ్య‌మేనా అని నోరెళ్ల‌బెట్టుకుంటున్నారు. మ‌న కంటే ప‌ది రెట్లు చిన్న‌దైన మ‌ళ‌యాల ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఈ రోజు కేవ‌లం మోహ‌న్ లాల్ కార‌ణంగా పెద్ద ఇండ‌స్ట్రీ అయిపోయింది. మూడేళ్ల కింద ఈయ‌న చేసిన‌ దృశ్యం సినిమా తొలిసారి 50 కోట్ల మైలురాయిని మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీకి రుచి చూపించింది.
ఇక గ‌తేడాది ఈయ‌న న‌టించిన ఒప్పం, పులిమురుగ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిల‌వ‌డ‌మే కాదు.. ఊహ‌కు కూడా అంద‌ని రికార్డుల్ని సెట్ చేసాయి. గ‌తేడాది సెప్టెంబ‌ర్ లో విడుద‌లైన ఒప్పం 60 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీలో టాప్ 3లో చోటు సంపాదించింది. ఇక అదొచ్చిన నెలకే అక్టోబ‌ర్ లో వ‌చ్చిన‌ పులి మురుగ‌న్ కూడా రికార్డుల ప‌రంప‌ర కొన‌సాగించింది. వైశాఖ్ అనే కొత్త కుర్రాడు తెర‌కెక్కించిన పులి మురుగన్ 150 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీలో 50 కోట్లు అంటేనే మ‌తులు పోతుంటాయి. అదొచ్చిన రెండు నెల‌ల‌కే ముంత్రివ‌ల్లిక‌ల్ తాలిరిక్కుం బోల్ కూడా సూప‌ర్ హిట్ అయింది.
దృశ్యం త‌ర్వాత మీనాతో మోహ‌న్ లాల్ క‌లిసి న‌టించిన సినిమా ఇది. భార్య‌ను కాద‌ని.. పరాయి సుఖాల కోసం భ‌ర్త పాకులాడితే ఎలాంటి క‌ష్టాలు వ‌స్తాయ‌నేది ఈ సినిమా క‌థ‌. ఏజ్ కు త‌గ్గ పాత్ర‌లో మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించాడు మోహ‌న్ లాల్. అంత‌టి స్టార్ ఇమేజ్ ఉన్నా.. అవ‌న్నీ ప‌క్క‌న‌బెట్టి క‌థ కోసం ఎలాగైనా మారిపోవ‌డానికి సిద్ధంగా ఉన్నాడు కాబ‌ట్టే మోహ‌న్ లాల్ ఈ ఏజ్ లోనూ అంత‌టి రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న ఒడియాన్ సినిమా కోసం లుక్ మొత్తం మార్చేసారు. 57 ఏళ్ల వ‌య‌సులో 20 కేజీలు త‌గ్గి సొంతంగా యాక్ష‌న్ సీక్వెన్సులు చేస్తూ వెళ్తున్నాడు. మొత్తానికి ఈయ‌న దూకుడు చూస్తుంటే వ‌చ్చే ఏడాది కూడా మ‌రో రెండు మూడు బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టేలా క‌నిపిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here