సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు..? అయితే రకుల్ లేదంటే టైమ్ బాగుంది కాబట్టి పూజా హెగ్డే.. అదీ కాదంటే పద్దతిగా అనుష్క పేరే చెప్పాల్సి వస్తుందేమో..? కానీ లెక్కలు మాత్రం వీళ్లెవరు కాదు.. సమంతే ఇప్పటికీ నెంబర్ వన్ అని చెబుతున్నాయి. ఆమె రికార్డులే దీనికి సాక్ష్యం. ఇప్పటి వరకు కనీసం ఏ హీరోయిన్ కలలో కూడా ఊహించని రికార్డులన్నీ సమంత తన వశం చేసుకుంటుంది. ఈమె కెరీర్ లో 50 కోట్లు దాటిన సినిమాలు 11.. 100 కోట్ల గ్రాస్ దాటిన సినిమాలు అరడజన్ ఉన్నాయి. ఈ స్థాయి ట్రాక్ రికార్డ్ ఉన్న హీరోయిన్ సౌత్ లోనే మరొకరు లేరు. ఇక ఓవర్సీస్ లో అయితే క్వీన్ ఆఫ్ మిలియన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. సమంత అడుగు పెడితే మిలియన్ డాలర్ వచ్చేసినట్లే. అంత మాయ చేస్తుంది ఈ భామ.
తాజాగా రంగస్థలం అయితే ఏకంగా 2.5 మిలియన్ దాటేసి 3 మిలియన్ వైపుగా అడుగేస్తుంది. ఇప్పటి వరకు సమంత నటించిన 13 సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్ లో చోటు సంపాదించాయి. దక్షిణాదినే కాదు.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మరే హీరోయిన్ కు సాధ్యం కాని రికార్డ్ ఇది. 2011లో దూకుడు సినిమాతో మొదలైంది ఈ మిలియన్ డాలర్ క్లబ్ దండయాత్ర. అప్పట్నుంచీ రంగస్థలం వరకు రచ్చ సాగుతూనే ఉంది. దూకుడు.. ఈగ.. అత్తారింటికి దారేది.. మనం.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. జనతా గ్యారేజ్.. బ్రహ్మోత్సవం.. మెర్సల్.. 24.. అ..ఆ.. సన్నాఫ్ సత్యమూర్తి.. తెరీ.. ఇప్పుడు రంగస్థలంతో సమంత ట్రాక్ రికార్డ్ ఆకాశమంత ఎత్తులో ఉంది. ఇది చూసిన తర్వాత కూడా సమంతను నెంబర్ వన్ కాదంటే ఎలా..? నాగచైతన్యతో పెళ్లైన తర్వాత కూడా ఇప్పటికీ వరస సినిమాలతో బిజీగా ఉంది సమంత. యు టర్న్ తో పాటు తమిళనాట మూడు సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.