గ‌డ్డం.. తెచ్చిపెడుతుంది విజ‌యం..!


ఒక‌ప్పుడు తెలుగు సినిమా హీరో నీట్ గా షేవ్ చేసుకుని.. స్టైల్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. గ‌డ్డం పెంచేసుకుని మాస్ గా ర‌ఫ్ లుక్ లో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. గ‌డ్డంతో ఉంటేనే ఇప్పుడు సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. ఈ మ‌ధ్యే వ‌చ్చిన రంగ‌స్థ‌లం దీనికి నిద‌ర్శ‌నం. అప్ప‌ట్లో మ‌గ‌ధీర త‌ర్వాత మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు గ‌డ్డం పెంచాడు రామ్ చ‌ర‌ణ్. విచిత్రంగా ఈ రెండు సినిమాలు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించాయి.
ఇక చ‌ర‌ణ్ తో పాటు చిరంజీవి కూడా సైరాలో గ‌డ్డంతోనే క‌నిపిస్తున్నాడు. ద‌ర్శ‌కులు తాము గ‌డ్డాల‌తో ఉన్నాం క‌దా అని అదే తిప్ప‌లు ఇప్పుడు హీరోల‌ను కూడా పెడుతున్నారు. క‌థ‌కు కావాలో.. లేదంటే వాళ్ల‌కు కావాలో తెలియ‌దు కానీ హీరోల‌ను గ‌డ్డంతో చూపించ‌డం ఇప్పుడు ఫ్యాష‌న్ అయిపోయింది. రాజ‌మౌళినే తీసుకోండి.. ఈయ‌న‌కు గ‌డ్డం ఎప్పుడూ ఉంటుంది. అందుకే త‌న హీరోల‌ను కూడా గ‌డ్డంతో చూపించాడు బాహుబ‌లిలో. సుకుమార్ అయితే మ‌రీను.. నాన్న‌కు ప్రేమ‌తో సినిమా కోసం ఏడాదికి పైగా గ‌డ్డంతోనే ఎన్టీఆర్ ను ఉంచేసాడు. రామ్ చ‌ర‌ణ్ ప‌రిస్థితి కూడా ఇంతే. రంగ‌స్థ‌లం కోసం ఏడాదికి పైగా గ‌డ్డంతోనే ఉన్నాడు చ‌ర‌ణ్.
హ‌ను రాఘ‌వ‌పూడి కూడా గ‌డ్డంగ్యాంగ్ లో స‌భ్యుడే. ఈయ‌న తొలి సినిమా అందాల రాక్ష‌సి.. త‌ర్వాత కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథల్లో హీరోలు గ‌డ్డాల‌తో క‌నిపిస్తారు. ఇక మొన్నొచ్చిన లై సినిమాలో కూడా నితిన్ కొత్త లుక్ లో క‌నిపించాడు. సినిమా ఫ్లాపైనా నితిన్ లుక్ హిట్టైంది. ఇప్పుడు శ‌ర్వానంద్ కోసం రెడీ చేసిన క‌థ‌లో కూడా హీరో గ‌డ్డంతోనే ఉన్నాడు. అనిల్ రావిపూడి కూడా ఎఫ్ 2 కోసం వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ ల‌ను గ‌డ్డంతో చూపించ‌బోతున్నాడు.
వంశీ పైడిప‌ల్లి కూడా మ‌హేశ్ బాబుతో గ‌డ్డం పెంచే కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టాడు. కెరీర్ లోనే తొలిసారి ఓ సినిమా కోసం గ‌డ్డం పెంచుతున్నాడు మ‌హేశ్. ఈ మ‌ధ్యే భ‌ర‌త్ అనే నేనులో కాసేపు పెట్టుడు మీసంతో క‌నిపించాడు మ‌హేశ్. ఇప్పుడు నిజంగానే మీసాలు పెంచుతున్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేతలో గ‌డ్డంతో క‌నిపిస్తున్నాడు. డిఫెరెంట్ లుక్ తో పాటు విజ‌యాలు కూడా వ‌స్తుండ‌టంతో మ‌న హీరోలు కూడా మ‌రో మాట లేకుండా గ‌డ్డాలు పెంచేస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో ఇప్పుడు గ‌డ్డం గ్యాంగ్ బాగా పెరిగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here