చైతూను టార్గెట్ చేసిన చైతూ..


అదేంటి.. టైటిల్ గానీ త‌ప్పు రాసారా ఏంటి.. చైతూతో పోటీ ప‌డుతున్న చైతూ ఏంటి అనుకుంటున్నారా..? అవును.. విన‌డానికి వింత‌గా ఉన్నా ఇదే నిజం. త‌న సొంత సినిమాతోనే ఇప్పుడు పోటీకి సై అంటున్నాడు ఈ హీరో. ఈయ‌న ప్ర‌స్తుతం ఒక‌టి రెండు కాదు.. ఐదు సినిమాలు చేస్తున్నాడు.
ఇందులో రెండు సినిమాలు మాత్రం ఆగ‌స్ట్ లోనే విడుద‌లకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇదే ఇప్పుడు చైతూ నిర్మాత‌ల‌ను కూడా కంగ‌రు పెడుతున్న విష‌యం. స‌వ్య‌సాచి జులైలోనే రావాల్సి ఉన్నా అనుకోని కార‌ణాల‌తో ఆల‌స్యం అయింది. అయితే ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 17న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేక‌ర్స్.
ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. చందూమొండేటి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం క‌చ్చితంగా 30 కోట్ల క‌ల‌ను తీరుస్తుంద‌ని న‌మ్ముతున్నాడు ఈ హీరో. ఇక దాంతోపాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో శైల‌జారెడ్డి అల్లుడుపై కూడా అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఆగ‌స్ట్ 31న అల్లుడు రానున్నాడు. అను ఎమ్మాన్యువ‌ల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది.
ఈ రెండు సినిమాల‌కు కేవ‌లం రెండు వారాల గ్యాప్ స‌రిపోతుందా అనేది ఇప్పుడు అస‌లు ప్ర‌శ్న‌. అదీ కాకుండా ఆగ‌స్ట్ 15న విజ‌య్ దేవ‌రకొండ గీత‌గోవిందం విడుద‌ల కానుంది. మ‌రోవైపు శైల‌జారెడ్డి అల్లుడు.. అల్ల‌రి అల్లుడు చిత్రానికి అన్ అఫీషియ‌ల్ రీమేక్ అని తెలుస్తుంది. క‌థంతా దాని స్పూర్థితోనే మారుతి రాసుకున్నాడ‌ని తెలుస్తుంది.
ఈ చిత్రంతో పాటు శివ‌నిర్వాణ సినిమా కూడా ఉంది. ఇందులో స‌మంత‌తో న‌టించ‌నున్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ మూడు సినిమాల‌తో క‌చ్చితంగా త‌న మార్కెట్ పెరిగిపోతుంద‌ని భావిస్తున్నాడు చైతూ. మ‌రి చూడాలిక‌.. అక్కినేని వార‌సుడి ఆశ‌ల‌ను ఈ సినిమాలు ఎంత‌వర‌కు తీరుస్తాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here