నారా రోహిత్.. నేనోర‌కం.. 

అవును.. ఇప్పుడు ఈ టైటిల్ మ‌నోడికి ప‌ర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంది. గీతలో శ్రీ‌కృష్ణుడు ఏం చెప్పాడంటే ఏమో భ‌య్యా నాకు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు అనే టైప్ ఈ హీరో. కానీ అందులో కృష్ణుడు చెప్పిన దాన్ని మాత్రం ప‌క్కాగా ఫాలో అవుతున్నాడు ఈ కుర్ర హీరో. అదేంటంటే ప‌ని చేయ్.. ఫ‌లితం ఆశించ‌కు.. అవును.. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక్క‌సారి నారా రోహిత్ కెరీర్ ను చూస్తే ఇదే అర్థ‌మ‌వుతుంది. ఫ్రెండ్స్ కోసం.. కావాల్సిన వాళ్ల కోసం.. త‌న కోసం ఇలా అన్ని సినిమాలు చేస్తూనే ఉంటాడు. 365 డేస్ డేట్స్ ఇస్తూనే ఉంటాడు. కానీ అవి వ‌స్తున్నాయా.. ఎప్పుడు వ‌స్తాయి.. వ‌స్తే ఆడుతున్నాయా లేదా అనేది మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోడు ఈ హీరో.
మిగిలిన హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయ‌డానికే నానా తంటాలు ప‌డుతుంటే.. రోహిత్ మాత్రం ఏకంగా అర‌డ‌జ‌న్ సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం మ‌రో అర‌డ‌జ‌న్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ద‌ర్శ‌కులు కూడా నారా వార‌సుడి కోసం క‌థ‌లు రాస్తూనే ఉన్నారు. గ‌త ఏడాది కాలంలోనే రోహిత్ ఏకంగా 8 సినిమాలు విడుద‌ల చేసాడు. కానీ ఇందులో ఒక‌ట్రెండు కూడా సూప‌ర్ హిట్ కాలేదు. దానిపై ఒక్క‌సారైనా నారా రోహిత్ త‌న కెరీర్ ను తానే విశ్లేషించుకోవాల్సిన అవ‌స‌రం అయితే ఉంది. మొన్నొచ్చిన బాల‌కృష్ణుడు అయితే ఎప్పుడొచ్చి ఎప్పుడెళ్లిందో కూడా తెలియ‌దు. ప‌వ‌న్ మ‌ల్లెల తెర‌కెక్కించిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ మ‌ధ్యే వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు సినిమా చేస్తున్నాడు నారా రోహిత్. సుధీర్ బాబు ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. గ‌తంలో ఈ ఇద్ద‌రు క‌లిసి శ‌మంత‌క‌మ‌ణిలో న‌టించారు. దీంతోపాటు పండ‌గ‌లా దిగి వ‌చ్చాడు.. బాణం ఫేమ్ చైత‌న్య దంతులూరితో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు.
ఇక మొన్న‌టికి మొన్న ఆట‌గాళ్లు అనే మ‌రో సినిమా మొద‌లుపెట్టాడు నారా రోహిత్. ప‌రుచూరి ముర‌ళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్పుడు ఎన్ఆర్ 18 అంటూ మ‌రో కొత్త సినిమా పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇందులో మూగ‌వాడిగా న‌టించ‌నున్నాడు రోహిత్. ఈ సినిమా షూటింగ్ ఉగాది సంద‌ర్భంగా మార్చ్ 18న మొద‌లు కానుంది. మంజునాధ్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. దీంతోపాటు వెంక‌టేశ్ తేజ సినిమాలోనూ కీల‌క‌పాత్ర‌లో న‌టించనున్నాడు నారా రోహిత్. ఇలా ఒక్కో సినిమా లెక్క క్లియ‌ర్ చేస్తున్నాడు నారా రోహిత్. ఇప్ప‌టికైతే ఒక‌ట్రెండు హిట్ల‌తో కెరీర్ ను లాగిస్తోన్న నారా రోహిత్.. కెరీర్ ను మార్చే సాలిడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం వేచి చూస్తున్నాడు. మ‌రి వీటిలో ఏ సినిమా అది రోహిత్ కు ఇస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here