బాహుబలిని ఎవరూ కొట్టలేరని తెలిసి.. మన ఇండస్ట్రీలో హీరోలు నాన్ బాహుబలి అనే ఓ కేటగిరీని పెట్టుకున్నారు. కానీ అప్పుడప్పుడూ వీటిని కూడా టచ్ చేస్తున్నారు మన హీరోలు. బాహుబలి 2 ను టచ్ చేయడం అంత ఈజీ కాదు కానీ మొదటి భాగం సృష్టించిన రికార్డులను మాత్రం మన హీరోలు ఒక్కొక్కరుగా వచ్చి కుదిపేస్తున్నారు. ఇప్పటికే తొలిరోజు రికార్డులను ముందు చిరంజీవి.. తర్వాత పవన్ కళ్యాన్ వచ్చి కదిలించారు. ఇక ఇప్పుడు రెండు మూడు నాలుగు రోజుల రికార్డులను రంగస్థలం కుదిపేసింది. ఈ చిత్రం తొలి రోజు నుంచి రికార్డుల పర్వం మొదలుపెట్టింది. నాలుగో రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 6.38 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలి 1 పేరు మీదున్న రికార్డును ఇప్పుడు తన పేర రాసుకున్నాడు చరణ్. ఇదివరకు బాహుబలి 1 నాలుగో రోజు 6.28 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు దాన్ని చెరిపేసాడు రామ్ చరణ్. ఇక రెండో రోజు కూడా బాహుబలి 9 కోట్లు సాధిస్తే.. రంగస్థలం 9.15 కోట్లు తెచ్చింది. మూడోరోజు బాహుబలి 2 కాకుండా 10 కోట్లు తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది రంగస్థలం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం 45 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఐదోరోజు కూడా చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆ రోజు కూడా కనీసం 5 కోట్ల షేర్ వస్తుందని ఊహిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. తొలి వారం ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 70 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే ఖైదీ నెం.150 రికార్డులను కూడా చరణ్ దాటేసినట్లే. మరి చూడాలిక.. ఈ చిత్ర రచ్చ ఇంకెంత దూరం ఇలాగే సాగనుందో..?