బ‌ర్త్ డే బాయ్ ర‌జినీకాంత్.. 

డిసెంబ‌ర్ 12.. ఇది తెలుగు వాళ్ల‌కు పెద్ద‌గా ప్ర‌త్యేకం కాక‌పోవ‌చ్చు. కానీ త‌మిళ‌నాట మాత్రం ప్ర‌తీ ఏడు ఈ తేదీ ఓ పండ‌గ‌. ఎందుకంటే ఆ రోజు ఓ సూప‌ర్ స్టార్ పుట్టిన‌రోజు.. ఓ లెజెండ్ జ‌న్మించిన రోజు.. ఇండియ‌న్ సినిమా రికార్డుల‌ను క‌నుస‌న్న‌ల్లో ఆజ్ఞాపిస్తున్న ఓ మాస్ హీరో పుట్టిన‌రోజు.. అత‌డే వ‌న్ అండ్ ఓన్లీ ర‌జినీకాంత్. ఇండియాలో 65 ఏళ్లు దాటిన త‌ర్వాత కూడా ఏ స్టార్ హీరోకు 300 కోట్ల మార్కెట్ లేదు. కానీ ర‌జినీకి మాత్ర‌మే అది సాధ్యం. 70కి ఇంకా మూడేళ్లే చేరువ‌గా ఉన్నా ఈయ‌న ఇమేజ్ మాత్రం ఆకాశ‌మే. ఇది చూసి మిగిలిన హీరోలు కూడా కుళ్ళుకోవాల్సిందే. సామాన్యుడిలా క‌నిపించే అసామాన్యుడు ర‌జినీకాంత్. శిఖ‌రం కూడా ఈయ‌న ముందు త‌ల దించుకుని ఉంటుంది. అంత ఒద్దిక‌గా ఉంటాడు సూప‌ర్ స్టార్. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడుక‌ట్టుకుని ఉన్నా.. హిమాల‌యాలే త‌న ఇంటిగా భావిస్తుంటాడు. 2017 డిసెంబ‌ర్ 12తో 66 ఏళ్లు పూర్తి చేసుకుని.. 67వ వ‌సంతంలోకి అడుగిడుతున్నాడు మ‌న సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్.
అత‌డు న‌డిస్తే ఓ స్టైల్.. కూర్చుంటే ఓ స్టైల్.. మాట్లాడితే మ‌రో స్టైల్.. సిగ‌రెట్ తాగితే స్టైల్.. అలా ప‌క్క‌కు చూసినా కూడా ఓ స్టైల్.. ఒక్క‌టేమిటి ఏం చేసినా.. ఎలా చూసినా.. ఎక్క‌డ అడుగేసినా అది స్టైలే. ఒక్క మాట‌లో చెప్పాలంటే స్టైల్ అనే ప‌ద‌మే ఆయ‌న కోసం పుట్టిందేమో అనిపిస్తుంది. స్టైల్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా మారిపోయాడు ర‌జినీకాంత్. ఎక్క‌డో మ‌హారాష్ట్ర‌లో జ‌న్మించిన‌ శివాజీ రావ్ గైక్వాడ్.. కాల‌క్ర‌మేనా ర‌జినీకాంత్ గా మారాడు. క‌ర్ణాట‌క‌లో బ‌తుకుయానం కోసం కండ‌క్ట‌ర్ గా ప‌నిచేసాడు. త‌న స్నేహితుడి ప్రోత్భ‌లంతో న‌టుడు కావాల‌ని చెన్నైలో అడుగు పెట్టారు. 1975 లో బాల‌చంద‌ర్ తెర‌కెక్కించిన అపూర్వ రాగంగ‌ల్ సినిమాతో తొలిసారి త‌మిళ సినిమాకు ప‌రిచ‌యం అయ్యారు. అదే ఏడాది తెలుగులో తూర్పు ప‌డ‌మ‌ర‌గా విడుద‌లైంది ఈ చిత్రం. ఆ త‌ర్వాత కొన్ని సినిమాల్లో విల‌న్ గా కూడా న‌టించారు ర‌జినీకాంత్.
70వ ద‌శ‌కం చివ‌ర్లో విల‌న్ గా న‌టించిన ర‌జినీ.. 80ల్లోకి వ‌చ్చేస‌రికి హీరో అయ్యారు. బిల్లా సినిమాతో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రం ర‌జినీకాంత్ లోని మాస్ హీరోను బ‌య‌టికి తీసింది. క‌మ‌ల్ హాస‌న్ క్లాస్ సినిమాల‌తో కుమ్మేస్తుంటే.. ఎంజిఆర్, శివాజీ గ‌ణేష‌న్ లాంటి హీరోల నుంచి పోటీ త‌ట్టుకుని.. వాళ్ల‌ను దాటుకుని మాస్ హీరో అయ్యాడు రజినీకాంత్. 80ల్లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చి సూప‌ర్ స్టార్ అయ్యాడు. ఇక 90వ ద‌శ‌కం సూప‌ర్ స్టార్ కు స్వ‌ర్ణ‌యుగం. మాప్పిళ్లై.. బాషా.. ముత్తు.. ప‌డ‌య‌ప్పా.. లాంటి ఎన్నో సంచ‌ల‌నాత్మ‌క సినిమాలతో ఇండియ‌న్ రికార్డుల‌ను సైతం కుదిపేసాడు ర‌జినీకాంత్.
మిలీనియం మొద‌లైన త‌ర్వాత ర‌జినీ జోరు కాస్త త‌గ్గింది. బాబాతో వెన‌క‌బ‌డినా.. 2005లో చంద్ర‌ముఖితో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు ర‌జినీకాంత్. ఈ చిత్రం అప్ప‌టి వ‌ర‌కు ఉన్న త‌మిళ సినిమా రికార్డుల‌న్నింటినీ తుడిచేసింది. ఆ త‌ర్వాత శివాజీ.. రోబో లాంటి సినిమాలు ర‌జినీ స్టామినా ఏంటో తెలియ‌జేసాయి. క‌బాలి యావ‌రేజ్ టాక్ తోనే 250 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇకిప్పుడు 2.0తో పాటు కాలా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ర‌జినీకాంత్. కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న సూప‌ర్ స్టార్.. త్వ‌ర‌లోనే రాజ‌కీయ అరంగేట్రం కూడా చేస్తారనే వార్త‌లొస్తున్నాయి. ఈయ‌న ఎక్క‌డున్నా.. ఏ రంగంలోకి వ‌చ్చినా విజ‌యం వెంటే ఉండాల‌ని ఆశిస్తూ మ‌రోసారి ర‌జినీకాంత్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here