రాజమౌళి వాళ్లను టెన్షన్ పెడుతున్నాడోచ్..


రాజ‌మౌళి అంటేనే టెన్ష‌న్.. ఆయ‌న ఎప్పుడూ ఎవ‌రో ఒక‌ర్ని టెన్ష‌న్ పెడుతూనే ఉంటాడు. త‌న విజ‌యాల‌తో ప‌క్క ద‌ర్శ‌కుల‌ను.. క‌లెక్ష‌న్ ల‌తో బాక్సాఫీస్ ను.. టేకింగ్ తో అవార్డుల‌ను ఇలా టెన్ష‌న్ పెడుతూనే ఉంటాడు.
ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. రాజ‌మౌళి దెబ్బ‌కు ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నారు. వాళ్లే త్రివిక్ర‌మ్, బోయ‌పాటి. ఈ ఇద్ద‌రికి రాజ‌మౌళితో సంబంధం లేదు.. కానీ వీళ్లు చేస్తోన్న హీరోల‌తో మాత్రం జ‌క్క‌న్న‌కు రిలేష‌న్ ఉంది. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ తో మ‌ల్టీస్టార‌ర్ అక్టోబ‌ర్ నుంచి మొద‌లు పెట్ట‌నున్నాడు రాజ‌మౌళి. ఆ లోపే ఈ ఇద్ద‌రూ సినిమాలు పూర్తి చేయాలి. బోయ‌పాటి ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ తో..
ఎన్టీఆర్ తో త్రివిక్ర‌మ్ ప‌ని చేస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్టీఆర్ సినిమా మొద‌లైంది.. త్రివిక్ర‌మ్ తీరు చూస్తుంటే ఆర్నెళ్ల‌లో సినిమాను పూర్తి చేసినా చేసేలా ఉన్నాడు. కానీ ఎటొచ్చీ బోయ‌పాటి ద‌గ్గ‌రే కాస్త తేడా కొడుతుంది. ఈయ‌న రామ్ చ‌ర‌ణ్ సినిమాను ద‌స‌రా వ‌ర‌కు పూర్తి చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
రెండో షెడ్యూల్ కూడా అనుకున్న టైమ్ కు స్టార్ట్ కాలేదు. దాంతో ఈ సినిమాను ద‌స‌రాకు కాకుండా సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు బోయ‌పాటి. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు రాజ‌మౌళి ఊరుకుంటాడా..?
అన్ని రోజులు చ‌ర‌ణ్ ను ఇవ్వ‌కుంటే మ‌ల్టీస్టార‌ర్ పై ఎఫెక్ట్ ప‌డ‌దా..? ఇవ‌న్నీ తెర‌వెన‌క విష‌యాలు. అందుకే చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా త‌మ ద‌ర్శ‌కుల‌ను ముందు నుంచే సిద్ధం చేస్తున్నారు. అక్టోబ‌ర్ లోపు ఎలాగైనా సినిమాలు పూర్తి చేయాల‌ని చెబుతున్నారు. అలా ఇప్పుడు రాజ‌మౌళి సీన్ లో లేకుండానే ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌ను వ‌ణికిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here