విశ్వ‌రూపం 2 వ‌స్తుంద‌బ్బా.. చూస్కోండి..

Will Kamal Hassan Be In the List of MGR and Jayalalithaa?
క‌మ‌ల్ హాస‌న్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 50 ఏళ్లు దాటేసింది. కొన్ని వంద‌ల సినిమాలు చేసాడు కానీ ఏ రోజు ఒక్క సినిమా కోసం ఇంత‌గా క‌ష్ట‌ప‌డ‌లేదు క‌మ‌ల్ హాస‌న్. కానీ ఏం చేస్తాం.. ఒక్కోసారి ద‌రిద్ర దేవ‌త నెత్తిమీద డాన్సులు చేస్తుంటుంది. విశ్వ‌రూపం సినిమా విష‌యంలో క‌మ‌ల్ త‌ల‌పై ద‌రిద్ర దేవ‌త కాదు.. దేవ‌త‌లే డాన్సులేసారు. డాన్సులేం ఖ‌ర్మ‌.. క‌చేరీలు పెట్టారు. నాలుగేళ్లుగా అది న‌డుస్తూనే ఉంది. ఎంత‌కీ ఈ క‌చేరీ పూర్తి కావ‌డం లేదు. ఇక ఈయ‌న కూడా ఆశ‌లు వ‌దిలేసుకుని వేరే సినిమాల‌తో బిజీ అయ్యాడు క‌మ‌ల్. ఆ మ‌ధ్య వ‌ర‌స సినిమాలు చేసిన క‌మ‌ల్.. ఆ వేగంలో నాలుగేళ్ల కింద తాను చేసిన ఓ సినిమా గురించి పూర్తిగా మ‌రిచిపోయాడు లోకనాయ‌కుడు. 2013లో విశ్వ‌రూపం సినిమా చేసాడు. ఇది వ‌చ్చిన ఆర్నెళ్ల‌కే సీక్వెల్ కూడా విడుద‌ల చేయాల‌నుకున్నాడు క‌మ‌ల్. కానీ 2018 వ‌చ్చినా విశ్వ‌రూపం 2 మాత్రం రాలేదు. ఈ సినిమాకు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు కూడా క‌మ‌ల్ హాస‌నే. ఈ సినిమాతో ఆస్తుల్ని కూడా పోగొట్టుకున్నాడు క‌మ‌ల్.
ఇంత చుక్క‌లు చూపించినా విశ్వ‌రూపం అంటే క‌మ‌ల్ కు చాలా ఇష్టం. అందుకే విశ్వ‌రూపం 2 కూడా సిద్ధం చేసాడు ఈ హీరో. ఈ సినిమా షూటింగ్ ఆ మ‌ధ్య పూర్తి చేసాడు క‌మ‌ల్. ఈ సినిమా త‌ర్వాత పాప‌నాశం, చీక‌టిరాజ్యం, ఉత్త‌మ‌విల‌న్ సినిమాలు చేసాడు క‌మ‌ల్. కానీ విశ్వ‌రూపం 2కి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు మోక్షం రాలేదు. ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందో కూడా క్లారిటీ లేదు. విశ్వ‌రూపం హిట్ అనిపించుకున్నా.. క‌మ‌ల్ కు మిగిలిందేమీ లేదు. ఈ సినిమాతో న‌ష్టాలే వ‌చ్చాయి ఈ హీరోకి. దాంతో విశ్వ‌రూపం 2ని ఆస్కార్ ర‌విచంద్ర‌న్ నిర్మించాడు. కానీ మ‌ధ్య‌లోనే ఈ నిర్మాత కూడా చేతులెత్తేసాడు.
ఆ త‌ర్వాత అగ‌మ్య‌గోచ‌రంగా మారిన విశ్వ‌రూపం 2ను మ‌ళ్లీ క‌మ‌ల్ ముందుకొచ్చి నెత్తినేసుకున్నాడు. ఆ మ‌ధ్య ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ విశ్వ‌రూపం చూపించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు క‌మ‌ల్ హాస‌న్. ఇండియ‌న్ జెండాతో ఉన్న విశ్వ‌రూపం 2 ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే ఈ సారి క‌చ్చితంగా సెంటిమెంట్ తో కొట్ట‌బోతున్నాడు క‌మ‌ల్. ఇప్పుడు విశ్వ‌రూపం 2 ట్రైల‌ర్ కమింగ్ సూన్ అంటూ మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేసారు క‌మ‌ల్ హాస‌న్. గ‌తంలో ముర‌ద‌నాయ‌గం, మ‌ర్మ‌యోగి లాంటి సినిమాల్ని మొద‌లుపెట్టి ఆపేసిన క‌మ‌ల్.. విశ్వ‌రూపం 2కి ఆ గ‌తి రాకూడ‌ద‌ని ఫిక్స‌య్యాడు. అందుకే కాస్త ఆల‌స్య‌మైనా బాక్సుల్లోంచి ఆ సినిమాను బ‌య‌టికి తీసుకొస్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here