వెంకీ ఇప్పుడొచ్చి మాత్రం ఏం లాభం..?

Agnyaathavaasi Venkatesh - Pawan Kalyan Designs (1)
చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకుని ఏం లాభం అని తెలుగులో అద్భుత‌మైన సామెత ఒక‌టి ఉంది. ఇప్పుడు ఇది అజ్ఞాత‌వాసికి బాగా సూట్ అవుతుంది. విడుద‌ల‌కు ముందు లేని జాగ్ర‌త్త‌లు ఇప్పుడు తీసుకుంటున్నారు టీం. అస‌లు సంక్రాంతికి ముందు అజ్ఞాత‌వాసి త‌ప్ప మ‌రే సినిమా ప్రేక్ష‌కుడి మైండ్ లో కూడా లేదు. బాల‌య్య అభిమానులు సైతం ప‌వ‌న్ సినిమా కోసం ఆస‌క్తిగా వేచి చూసారు. ఎందుకంటే ఆ సినిమాపై అన్ని అంచ‌నాలున్నాయి మ‌రి. దానికి తోడు ప‌వ‌న్ 25వ సినిమా కావ‌డంతో మ‌రింత అంచ‌నాలు పెంచేసింది. కానీ అన్నింటినీ తీసుకెళ్లి కాశీలో క‌లిపేసారు ప‌వ‌న్ అండ్ త్రివిక్ర‌మ్. అస‌లు అజ్ఞాతవాసి బాగుండదేమో అనే ఆలోచ‌న కూడా ఏ స‌గ‌టు సినీ అభిమాని బుర్ర‌లో లేదు. త్రివిక్ర‌మ్ పై ఉన్న న‌మ్మ‌కం.. ప‌వ‌న్ ఇమేజ్ కు ఉన్న బ‌లం. కానీ ఇద్ద‌రూ క‌లిసి ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను మోసం చేసారు. తాము తీస్తున్న‌దేంటో వాళ్ల‌క‌ప్పుడు తెలిసుండ‌క‌పోవ‌చ్చు. కానీ ఇప్పుడు అర్థ‌మైంది. ప‌వ‌న్ క‌ల్యాణ్.. త్రివిక్ర‌మ్ లాంటి కాంబినేష‌న్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్ష‌కుల‌కు కొన్ని అంచ‌నాలు ఉంటాయి. కానీ సినిమా చూసిన త‌ర్వాత అన్నీ త‌ల‌కిందులు అయిపోయాయి. అస‌లు ఇదివ‌ర‌కు త్రివిక్ర‌మ్ ఇలాంటి త‌ల‌తోక లేని సినిమా ఏదీ చేయ‌లేదు. ఆయ‌న సినిమాల్లో ఓ థీమ్ ఉంటుంది.
ఖ‌లేజా లాంటి సినిమాలోనూ సూప‌ర్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఉంటుంది. ఆ కామెడీ కోస‌మే సినిమా ఇప్ప‌టికీ టీవీల్లో వ‌స్తే చూస్తుంటారు ప్రేక్ష‌కులు. అలాంటిది అజ్ఞాత‌వాసిలో మాత్రం ఇష్ట‌మొచ్చిన‌ట్లు తీసాడు త్రివిక్ర‌మ్. అస‌లు ఏ సినిమాలో లేనంత విచిత్ర‌మైన విన్యాసాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ప‌వ‌న్ తో బృహ‌న్న‌ల వేషాలు వేయించ‌డంలో ఉన్న అంత‌ర్యం ఏంటో ఆయ‌న‌కే తెలియాలి మ‌రి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి హీరో నుంచి ఇలాంటి స‌మ‌యంలో ఇది రావాల్సిన సినిమానా అంటూ నిల‌దీస్తున్నారు వాళ్లు..! పైగా సినిమాలో ప‌వ‌న్ వేసిన ఆ వేషాలు చూసి అరే.. అస‌లు ఇదేంటి ఇలా చేస్తున్నాడు అంటున్నారు. దానికితోడు చిన్న‌పిల్లాడిలా మాట్లాడ‌టం.. సినిమా అంతా డ్ర‌స్ కూడా న‌ల‌గ‌కుండా ఆయ‌న చేసిన ఫైట్లు.. జుట్టు చెర‌క్కుండా ఆయ‌న చూపించిన డాన్సుల భంగిమలు ఇవ‌న్నీ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఇక ఇప్పుడు ఇంత జ‌రిగిన త‌ర్వాత వెంక‌టేశ్ సీన్స్ యాడ్ చేస్తున్నారు. సినిమాలో ఓ సీన్ వెంకీ వ‌స్తాడు.. వ‌చ్చి ప‌వ‌న్ తో గ‌బ్బ‌ర్ సింగ్ తిక్క డైలాగ్ చెప్తాడు. ఆ సీన్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. దాంతో పాటు మొత్తం 7 నిమిషాల సీన్ బ‌య‌టికి వ‌స్తుంది. అవి చేసినా ఇప్పుడు క‌లెక్ష‌న్లు పెరుగుతాయ‌నే న‌మ్మ‌కం అయితే ఎవ‌రిలోనూ క‌నిపించ‌ట్లేదు.
అస‌లు విష‌యం ఏంటంటే.. అజ్ఞాత‌వాసి ఫ‌లితానికి అస‌లు కార‌ణం ఏంటి అని..? ఈ లోపం ప‌వ‌న్ లో ఉందా.. లేదంటే త్రివిక్ర‌మ్ లో ఉందా..? క‌నీసం చూసుకోలేదా..? ఇంత ప్ర‌స్టేజియ‌స్ ప్రాజెక్ట్.. పైగా 120 కోట్ల బిజినెస్ చేసిన సినిమాను ఇంత దారుణంగా ఎలా తీస్తారు.. అని ప్ర‌శ్నిస్తున్నారు ఇప్పుడు మ‌న‌సు మండిన అభిమానులు. ప‌వ‌న్ 25వ సినిమా క‌దా అని కోట్లాది ఆశ‌ల‌తో వ‌చ్చిన అభిమానుల ఆశ‌ల‌పై నిండా నీళ్లు పోసారు ప‌వ‌న్ అండ్ త్రివిక్ర‌మ్. ఏం చేసినా చూస్తారులే అనే అతి విశ్వాస‌మే ఇప్పుడు అజ్ఞాత‌వాసి కొంప ముంచేసిందేమో అనిపిస్తుంది కాస్త లోతుగా జాగ్ర‌త్త‌గా ఆలోచిస్తే..! ఈ పాపం ఎవ‌రిది అయినా కానీ ఇప్పుడు మునిగేది మాత్రం బ‌య్య‌ర్లే. మ‌రి ఈ చిత్రం సంక్రాంతి సీజ‌న్ అయినా యూజ్ చేసుకుని ఎన్ని కోట్లు తెస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here