సైరాకు ముహూర్తం కుదిరిందా..?


చిరంజీవి మ‌ళ్లీ ఇప్పుడు పూర్తిగా సినిమా హీరో అయిపోయాడు. ఈయ‌న‌కు ఇప్పుడు రాజ‌కీయాల‌తో సంబంధం లేదు. మొన్న కాంగ్రెస్ త‌ర‌ఫున క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా వెళ్ల‌లేదు మెగాస్టార్. వారం రోజులు ప్ర‌చారం చేస్తాడ‌నే వార్త‌లొచ్చినా.. ప్ర‌స్తుతానికి తాను పూర్తిగా రాజ‌కీయం నుంచి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు చిరంజీవి. ఈ ప‌నుల‌న్నీ ఇప్పుడు త‌మ్ముడు ప‌వ‌న్ చూసుకుంటుంటే..
ఈయ‌న మాత్రం ఫుల్ గా సినిమాల‌తో బిజీ అయిపోతున్నాడు. ఈయ‌న న‌టిస్తున్న సైరా షూటింగ్ ఇప్ప‌టికే స‌గానికి పైగా పూర్త‌యింది. జూన్ 5 నుంచి భారీ షెడ్యూల్ హైద్రా బాద్ లోనే మొద‌లు కానుంది. దీంతో దాదాపు 70 శాతం టాకీ పూర్తి కానుంది. ఈ చిత్ర షూటింగ్ అంతా డిసెంబ‌ర్ లోపు పూర్తి కావాల‌ని చిరంజీవి ఆదేశించిన‌ట్లు తెలుస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. సైరాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి.
దాంతో ఈ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోస‌మే క‌నీసం నాలుగు నెల‌లు కావాలి. అందుకే డిసెంబ‌ర్ లోపు షూటింగ్ పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. వ‌చ్చే ఏడాది మే 9న సైరాను రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు చిరంజీవి. ఆ రోజు జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి విడుద‌లైన రోజు. అందుకే సైరాకు ఆ ముహూర్తం ఖ‌రారు చేసారు. 200 కోట్ల‌తో ఈ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటే కొర‌టాల శివ సినిమాను కూడా మొద‌లు పెట్ట‌బోతున్నాడు చిరంజీవి. కుదిర్తే రెండూ ఒకేసారి పూర్తి చేయాల‌నుకుంటున్నాడు. 2019లో రెండు సినిమాల‌తో రావాల‌నేది చిరంజీవి ప్లాన్. మ‌రి అది ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుద్దో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here