మిస్ట‌ర్ మ‌జ్నుసినిమా రివ్యూ

రివ్యూ: మిస్ట‌ర్ మ‌జ్ను
న‌టీన‌టులు: అఖిల్, నిధి అగ‌ర్వాల్, ప్రియ‌ద‌ర్శి, రాజా, హైప‌ర్ ఆది, నాగ‌బాబు, సితార‌, సుబ్బ‌రాజు త‌దిత‌రులు
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
సంగీతం: థ‌మ‌న్
సినిమాటోగ్ర‌ఫీ: జార్జ్ సి విలియ‌మ్స్
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: వెంకీ అట్లూరి

వ‌ర‌స ఫ్లాపుల‌తో డీలా ప‌డిపోయిన అఖిల్.. మిస్ట‌ర్ మ‌జ్నుతో ఎలాగైనా మాయ చేయాల‌ని వ‌చ్చాడు. మ‌రి ఈయ‌న మాయ సాగిందా.. మిస్ట‌ర్ మ‌జ్ను అల‌రించిందా లేదా అనేది చూద్దాం..

క‌థ‌:
విక్కీ(అఖిల్) లండ‌న్ కాలేజ్ లో చ‌దువుకుంటుంటాడు. ఆయ‌న‌కు అమ్మాయిలు అంటే పిచ్చి.. కాదుకాదు అమ్మాయిల‌కు ఆయ‌నంటే పిచ్చి. చూసిన నెక్ట్స్ సెకండ్ ప‌డేస్తాడు. అలాంటి వ్య‌క్తి జీవితంలోకి నిక్కీ(నిధి అగ‌ర్వాల్) వ‌స్తుంది. ముందు అస‌హ్యించుకున్నా కూడా ఆ త‌ర్వాత విక్కీ కారెక్ట‌ర్ తెలిసి ప్రేమలో ప‌డిపోతుంది. విక్కీ కూడా ముందు ప్రేమించాల‌నే అనుకుంటాడు.. కానీ ప్రేమించిన‌ట్లు న‌టిస్తుంటాడు. ఆ త‌ర్వాత అది న‌ట‌న అని తెలుసుకుని విక్కీ జీవితంలోంచి వెళ్లిపోతుంది నిక్కీ. ఆమె కోసం లండ‌న్ వెళ్తాడు విక్కీ. త‌న‌ది ప్రేమ అని నిరూపించుకోడానికి పాట్లు ప‌డ‌తాడు.. ఆ క‌ష్టాలేంటి అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
అఖిల్ ను చూస్తుంటే గజినీ దండయాత్ర గుర్తుకు వస్తుంది.. విజయం సాధించే వరకు యుద్ధం ఆపకూడదని ఫిక్స్ అయిపోయాడు అక్కినేని వారసుడు. నేను మీ అఖిల్ అన్నా పట్టించుకోలేదు.. హలో చెప్పిన పలకరించలేదు ప్రేక్షకులు.. దాంతో ఇప్పుడు ప్రేమికుడిగా మళ్లీ వచ్చాడు అఖిల్. ఈసారి కాస్త కొత్తగా ట్రై చేస్తాడేమో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు అనుకున్నారు ప్రేక్ష‌కులు కూడా. కానీ మరోసారి రొటీన్ కథతోనే వచ్చాడు అఖిల్. తొలిప్రేమ ఇలాంటి క్లీన్ ఎంటర్టైనర్ తర్వాత అఖిల్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని వెంకీ కథ రాసుకున్నట్లు అనిపించింది.. ఫస్ట్ హాఫ్ వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బాగానే సాగాడు మిస్టర్ మజ్ను.. అప్పటివరకు ప్రేమకథలు కూడా బాగానే అలరించాయి..

కానీ అసలు ప్రేమ కథ మొదలైన తర్వాత తంటాలు మొదలయ్యాయి. కథ ముందుకు వెనక్కి వెళ్ళలేక అక్కడే ఆగినట్లు అనిపించింది. మనం కన్ఫ్యూజ్ అవుతున్నామా లేదంటే దర్శకుడు కన్ఫ్యూజ్ అవుతున్నాడా కాసేపు అర్ధం కాదు. ప్రీ క్లైమాక్స్.. దానికి ముందు కొన్ని సీన్లు తొలిప్రేమలో చూసినట్లే అనిపించింది. ఆ ప్రభావం వెంకీ అట్లూరిపై గట్టిగా పడిందని మిస్టర్ మజ్ను చూస్తుంటే అర్థమవుతుంది.. సెకండ్ హాఫ్ మిస్టర్ మజ్ను బాగా దెబ్బ కొట్టాడు ఏమో అనిపిస్తుంది. అఖిల్ తన వరకు బాగా చేశాడు.. చాలా అందంగా ఉన్నాడు.. నిధి అగర్వాల్ ఈ క్యారెక్టర్ కు పెద్దగా సరిపోలేదేమో అనిపించింది. ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీ పర్వాలేదు.. సెకండ్ హాఫ్ లో బొమ్మ తో మాట్లాడిన చాలా బాగుంది.. అది కామెడీ బాగా వర్కౌట్ అయింది. తొలిప్రేమలో తెలిసిన కథనే అందంగా చెప్పిన వెంకీ అట్లూరి.. ఈసారి కాస్త తడబడ్డాడు.. మూడోసారి కూడా అఖిల్ కు ప్రేక్షకులు సారీ చెప్పేలా కనిపిస్తున్నారు.. ఓవరాల్ గా మిస్టర్ మజ్ను కొంచెం ఇష్టం కొంచెం కష్టం.

న‌టీన‌టులు:
అఖిల్ బాగానే న‌టించాడు. ముందు సినిమాల‌తో పోలిస్తే ఈయ‌న‌లో చాలా మెచ్యూరిటీ వ‌చ్చింది అనిపించింది. ఎమోష‌న‌ల్ సీన్స్ కూడా చాలా బాగా న‌టించాడు అఖిల్. ఇక డాన్సులు కుమ్మేసాడు. నిధి అగ‌ర్వాల్ అందంగా ఉంది కానీ న‌ట‌నలో మాత్రం తేలిపోయింది. ప్రియ‌ద‌ర్శి కామెడీ బాగుంది. ఇక సెకండాఫ్ లో హైప‌ర్ ఆది ప‌ర్లేదు.. బొమ్మ‌తో చేయించిన కామెడీ బాగా వ‌చ్చింది. నాగ‌బాబు, సితార‌, రావు ర‌మేష్ లాంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్ అంతా త‌మ పాత్ర‌లో మెప్పించారు..

టెక్నిక‌ల్ టీం:
థ‌మ‌న్ పెద్ద‌గా ఈసారి ఆక‌ట్టుకోలేదు. తొలిప్రేమ‌కు అద్భుత‌మైన సంగీతం అందించిన ఈయ‌న ఈ సారి మాత్రం నిరాశ‌ప‌రిచాడు. ఒక‌టి రెండు పాట‌లు బాగున్నాయి కూడా పూర్తి ఆల్బమ్ మాత్రం కాదు. ఇక సినిమాటోగ్ర‌పీ అదిరిపోయింది. జార్జ్ సి విలియ‌మ్స్ అద‌ర‌గొట్టాడు. ఎడిటింగ్ న‌వీన్ నూలి ఫ‌స్టాఫ్ వ‌ర‌కు బాగానే ఎడిట్ చేసినా సెకండాఫ్ మాత్రం గాడి త‌ప్పింది. అంత‌గా ఆక‌ట్టుకోలేదు.. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టించాయి. ద‌ర్శ‌కుడిగా వెంకీ అట్లూరి ఈ సారి అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు అద్భుతంగా స్క్రీన్ ప్లే రాసుకున్న ఈ ద‌ర్శ‌కుడు రెండో భాగంలో మాత్రం చేతులెత్తేసాడు. తొలిప్రేమ సీన్స్ చాలానే క‌నిపించాయి. దానికి తోడు రంగుల రాట్నం సినిమా మ‌ళ్లీ చూస్తున్న‌ట్లు అనిపించింది. మొత్తానికి డైలాగ్ రైట‌ర్ గా వెంకీ ఓకే అనిపించాడు కానీ ద‌ర్శ‌కుడిగా కాదు.

చివ‌ర‌గా:
మిస్ట‌ర్ మ‌జ్ను.. అఖిల్ దండ‌యాత్ర కొన‌సాగుతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here