తమిళనాట రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. నెక్ట్స్ నెంబర్ వన్ అంటూ అభిమానుల నుంచి నీరాజనాలు అందుకుంటున్నాడు ఇళయ దళపతి. ఇంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. మురుగదాస్ తో ప్రస్తుతం విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ తమిళనాడులోని ఎక్కడో ఓ చిన్న గ్రామంలో జరుగుతుంది. ఇదే ఇప్పుడు విజయ్ కు సమస్యలు తీసుకొచ్చింది. గ్రామంలో షూటింగ్ చేయడం వల్ల కాదు.. అసలు షూటింగ్ చేయడం వల్లే విజయ్ కు తలనొప్పులన్నీ. అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో స్ట్రైక్ నడుస్తుంది. మార్చ్ 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు సినీ కార్మికులు. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఈ సమ్మెను ముందుండి నడిపిస్తున్నాడు.
24 క్రాఫ్ట్స్ అన్నీ స్ట్రైక్ చేస్తుండటంతో తమిళ ఇండస్ట్రీ స్థంభించిపోయింది. ఇలాంటి సమయంలో తన సమ్మెను పట్టించుకోకుండా విజయ్ తన సినిమా షూటింగ్ చేసుకోవడం ఇప్పుడు అందరికీ కోపం తెప్పిస్తుంది. విజయ్ లాంటి సూపర్ స్టార్సే నిర్మాతల మాట వినకపోతే ఇంకెందుకు ఈ సమ్మె అంటూ నిరసన వ్యక్తం అవుతుంది. ఇక్కడ తప్పు విజయ్ కంటే మురుగదాస్ దే ఎక్కువగా కనిపిస్తుంది. తాము రిలీజ్ డేట్ దసరాకు ఇచ్చామని.. ఇప్పుడు కానీ షూటింగ్ ఆపేస్తే నిర్మాతకు కోట్లల్లో నష్టం వస్తుందని.. ఇక్కడ కూడా నష్టపోయేదే నిర్మాతే కదా అంటున్నాడు మురుగదాస్. ఇప్పుడు కానీ సమస్య పరిష్కారం కాకపోతే అక్కడ రిలీజ్ డేట్ అందుకోవడం కష్టం.. ఇక్కడ షెడ్యూల్స్ కోసం ఖర్చు చేసిన కోట్లు నష్టం.. అందుకే తాము సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్నాం అని చెబుతున్నాడు మురుగదాస్. మరి ఈయన వాదనలతో విశాల్ ఎంతవరకు కన్విన్స్ అవుతాడో చూడాలిక..!