పూరీ, రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ మొద‌లైపోయింది.. ఇక చూస్కోండి..

ఒకప్పుడు ఆయన బాద్షా.. ఆయన సినిమాలకు ఆయనే కింగ్.. పూరి జగన్నాథ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉండేవి. సినిమా సినిమాకి సంచలనాలు సృష్టించడం పూరికి అలవాటు. ఒక్క సినిమాతో హీరో ఇమేజ్ మార్చడం ఆయ‌న‌కే సాధ్యం. కానీ కొన్నేళ్లుగా ఆ మ్యాజిక్ పనిచేయడం లేదు. పూరి సినిమా వస్తుందంటే ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్లిపోతుందో కూడా తెలియడం లేదు. నాసిరకం కథలతో అభిమానుల నుంచి విమర్శలు అందుకుంటున్నాడు ఈ డైరెక్టర్. చివరికి తనయుడు ఆకాష్ పూరి తో చేసిన మెహ‌బూబా సినిమా కూడా ఫ్లాప్ కావడంతో పూరీలో ఇక విషయం లేదని నిర్ధారణకు వచ్చారు ప్రేక్షకులు. కానీ పడటం లేవడం పరిగెత్తడం ఈ మూడు పూరికి బాగా అలవాటు. ఇప్పుడు కూడా ఇదే చేస్తారని నమ్మకంగా కనిపిస్తున్నాడు ఈ దర్శకుడు. రామ్ హీరోగా ఈయ‌న సినిమా మొద‌లైంది. ఇస్మార్ట్ శంక‌ర్ ఫ‌స్ట్ లుక్ ఎప్పుడో విడుద‌ల చేసిన పూరీ.. ఇప్పుడు సినిమాకు ముహూర్తం పెట్టాడు.

జ‌న‌వ‌రి 24 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఇందులో పూర్తిగా బ్యాడ్ బాయ్ గా నటించబోతున్నాడు రామ్. ఈ సినిమా కోసం ఆయన లుక్ కూడా మార్చేశాడు పూరి జగన్నాథ్. కచ్చితంగా ఈ సినిమాతో సంచలనం సృష్టించి చూపిస్తారని ధీమాగా చెబుతున్నారు ఈ దర్శకుడు. మరో వైపు కూడా ఎందుకో తెలియదు కానీ పూరి జగన్నాథ్ క‌థ‌ను బాగా నమ్మేశాడు రామ్. ఆయన ఏం చేశారో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం సంచలనం సృష్టిస్తుంది రాసిపెట్టుకోండి అంటున్నాడు ఈ కుర్ర హీరో. ఓ బాలీవుడ్ హీరోయిన్ ఇందులో నటించబోతోందని తెలుస్తోంది. ఛార్మి కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాత‌. పూరీ సొంత బ్యాన‌ర్ లో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. సినిమా మే లో విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి చూడాలి మరి ఈ సినిమాతో ఎంతవరకు పూరీ ఆశ‌లు నెర‌వేర‌తాయి అనేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here