గూఢచారి కుమ్మేసాడబ్బా..! స్టార్ ఇమేజ్ లేకుండా.. భారీ క్యాస్టింగ్ లేకుండా కథతో కొట్టాడు అడవిశేష్. ఈయన నటించిన గూఢచారి తొలి వీకెండ్ అదిరిపోయింది. చాలా మంది కుర్ర హీరోలకు కూడా అర్థం కాని రీతిలో ఏకంగా 6 కోట్లకు పైగానే షేర్ తీసుకొచ్చింది.
ఇప్పుడు బ్లాక్ బస్టర్ దారిలో నడుస్తున్నాడు మన జేమ్స్ బాండ్. గూఢచారి 116 అంటూ రచ్చ చేస్తున్నాడు ఇప్పుడు ఈ హీరో. క్షణం తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరో సినిమాతో వచ్చాడు అడవిశేష్. ఇన్నాళ్లూ ఈయన సినిమా వస్తుందంటే తక్కువగా అంచనా వేయడం కాదు.. అసలు అంచనా వేయడమే తక్కువ అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది.
క్షణంతోనే మనోడు ఇండస్ట్రీకి హింట్ ఇచ్చాడు. తను ఒకడిని ఉన్నానని. అప్పుడు కూడా ఈ హీరో గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి గూఢచారి అంటూ వచ్చి రచ్చ చేస్తున్నాడు శేష్. తొలిరోజే టాక్ బ్రహ్మాండంగా రావడంతో అదే కంటిన్యూ అయింది కూడా. తొలి రోజు కంటే రెండోరోజు.. రెండోరోజు కంటే మూడో రోజు కలెక్షన్స్ ఇంకా పెరిగాయి.
స్క్రీన్ ప్లే ప్లస్ అదిరిపోయే రైటింగ్ తో అడవిశేష్ మాయ చేసాడు. తనలో నటుడితో పాటు ఇంకా చాలా కోణాలున్నాయని మళ్లీ నిరూపించుకున్నాడు. జేమ్స్ బాండ్ సినిమాల తరహా ప్రభావం ఎక్కువగా కనిపించినా.. మనకు నచ్చేట్లుగానే కథ రాసుకున్నాడు అడవిశేష్. ఇక అభిషేక్ పిక్చర్స్ ఇచ్చిన 4 కోట్లతోనే ఇంత క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వడం అద్భుతమే. మొత్తానికి ఈ చిత్రం ఫుల్ రన్ లో ఈజీగా 10 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయమైపోయింది.